ముద్ర, భువనగిరి ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కన్న కొడుకులు నిర్లక్ష్యంతో తల్లిదండ్రుల బాగోగులు పట్టించు కోకపోవడంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. మానవతా హృదయంతో చలించిపోయిన కలెక్టర్ ఆ వృద్ధ దంపతులను ఆదరించి వయోవృద్ధుల ఆశ్రమం లో చేర్పించారు. వివరాల్లోకి వెళితే ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకొని, వారిని నిర్లక్ష్యం చేయడంతో గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. మరుసటి రోజే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి విచారణకు వెళ్ళి, పూర్తి వివరాలు సేకరించారు. వృద్ధ దంపతుల కుమారులైన ధర్మ వెంకట నరసింహ రెడ్డి, ధర్మ గోవర్దన్ రెడ్డి లను పలుమార్లు ఆర్డీఓ కార్యాలయం లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం భువనగిరి ఆర్డీవో, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం సబ్ డివిజన్ ట్రిబ్యునల్, వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, రాజస్వ మండలాధికారి భువనగిరి ఉత్తర్వు 2647/2025, తేదీ 27-01-2026 నాడు జడ్జిమెంట్ ఆర్డర్ పంపించారు. అయినా ఆ కుమారులు మారలేదు, ఆర్డీఓ ఆర్డర్ ను బేఖాతరు చేశారు.

దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు అప్పిలేట్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను సోమవారం ప్రజావాణి లో కలిసి మొరపెట్టుకున్నారు. మాకు ఎవరూ లేరు. మాకు మీరే దిక్కు, మమ్మల్ని అనాధాశ్రమం లో చేర్పించండి అంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆ వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు లోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేసే కొడుకులకు ఈ సంఘటన కనువిప్పు కలుగాలని ఆశిద్దాం.