ముద్ర ప్రతినిధి, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేయనున్నట్లుగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్ అన్నారు ఈ మేరకు బుధవారం ఆత్మకూరులోని ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన అమరచింత ఆత్మకూరు మండలాల జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నివేదికను అందజేశామని, అందులో భాగంగానే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం తోపాటుగా ఉండేందుకు ఇల్లు మంజూరీ చేయించేందుకు తాము తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన తెలిపారు .
ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడేది కేవలం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మాత్రమేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో సమస్యల సాధన కోసం ఐజేయూ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనేందుకు జర్నలిస్టుల సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సీనియర్ నాయకులు పౌర్ణారెడ్డి, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి, విజయ్, మాధవరావు తదితరులతో పాటుగా ఉమ్మడి ఆత్మకూర్ అమరచింత మండలాలకు చెందిన విలేకరులు పాల్గొన్నారు.