న్యూఢిల్లీ :
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి కోరారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇందిరా భవన్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను వెనక్కి ఇవ్వాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. ఆ సమయంలో తనను రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం ఇచ్చిన హామీని చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి… రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను ఖర్గేకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచ్ 70 శాతం స్థానాలను, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించిందన్న చిన్నారెడ్డి.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఖర్గేకు వివరించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని మల్లికార్జున్ ఖర్గే అభినందించారని చిన్నారెడ్డి తెలిపారు.