Take a fresh look at your lifestyle.

నెలాఖరులోగా నామినేటెడ్​, కార్పొరేషన్​ పోస్టుల భర్తీ

  • పార్టీలో కష్టపడే వారికే పదవులు
  • మంత్రివర్గ విస్తరణను సీఎం, అధిష్టానం చూసుకుంటుంది
  • పీసీసీ కూర్పుకు సన్నాహాలు జరుగుతున్నాయి
  • టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​

ముద్ర, తెలంగాణ బ్యూ‌‌రో :- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్, కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ఈ నెలాఖరు లోపే భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పార్టీ పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, అధిష్ఠానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై బుధవారం ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించినట్లు టీపీసీసీ చీఫ్​ వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్​ కుమార్​ గౌడ్​ సీఎం రేవంత్​ రెడ్డి తో కలిసి బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పని తీరు భేషుగ్గా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశంసించారని టీపీసీసీ చీఫ్ చెప్పారు. జీహెచ్‌హెంసీ,స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ..తమకు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మహేశ్​ కుమార్​ గౌడ్​ చెప్పారు. ఇందులో ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొంటారని వెల్లడించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.