- జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు.
- ప్రతి గ్రామంలో వన నర్సరీల ఏర్పాటు.
- అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలి.
- ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్దంగా ఉండాలి.
- ఔషద మొక్కలు, పూల మొక్కలపై దృష్టిపెట్టాలి.
- రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవం పేరిట చేపడుతుందన్నారు.ఈ ఏడాది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అటవీ, ఇతర శాఖ అధికారుల ఆధ్వర్యంలో జూన్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్న లక్ష్యంతో అధికారులు సిద్ధం చేసిన పీపీటీనీ మంత్రి సురేఖ వీక్షించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఏడాది అనుభవాల ఆధారంగా మరింత పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవం కింద పకడ్బందీ కార్యచరణ రూపొందించాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్ధం అవ్వాలని మంత్రి సురేఖ ఆదేశించారు. జిల్లాల్లో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని సూచించారు. గతేడాది శాఖలు, జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా 19.04 కోట్లు నాటినట్టు మంత్రి సురేఖ గుర్తు చేశారు. 95 శాతం మేరకు మొక్కలు నాటారన్నారు. ఈ సారి 100 శాతం మనం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని చెప్పారు.ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. ఇండ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గతం కంటే ఈసారి మాన్ సూన్ ముందే వచ్చిందని… ఈ నేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. ఏ ఏరియాలో ఎటువంటి చెట్లు నాటాలో గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మంత్రి సూచించారు. ఈ దఫా వనమహోత్సవంలో ఈత, తాటి, వేప, చింత, కుంకుడు మొక్కలు నాటించాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సాహాకాలు ఇవ్వాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.మొక్కల పెంపకంలో కృషి చేసిన వారికి పలు విధాలుగా గుర్తింపు ఇవ్వాలన్నారు. వనజీవి రామయ్య వంటి మహనీయుల కుటుంబీకులను సన్మానం చేయాలని మంత్రి సురేఖ తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఎంఏయూడీ సెక్రటరీ టీ కే శ్రీదేవి, ప్రియాంక వర్గీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.