- ఈ-పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు.
- ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
- సత్తుపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం తనిఖీ.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: రైతులకు కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఆయన సత్తుపల్లిలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు, మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ-పాస్ మిషన్ పని తీరును పరిశీలించారు. ఈ-పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు జరగాలని, మాన్యువల్ గా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా విక్రయాల రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులు వరిపై మొగ్గు చూపుతున్నారని, అధిక లాభాలున్న హార్టికల్చర్ వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. పామాయిల్ పంట చాలా లాభదాయకమని, అంతర పంటలుగా ఇతర పంటలను సాగు చేయవచ్చని సూచించారు. డ్రోన్ తో ఎరువులు, క్రీమీ సంహారక మందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు, సమయం ఆదా అవుతుందన్నారు. వ్యవసాయ అధికారులు, వారి వారి లక్ష్యం మేరకు విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాలు తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్ పర్యటనలో కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి. శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి మండల వ్యవసాయ అధికారి వై. శ్రీనివాసరావుఉన్నారు.
- ఏరియా ఆసుపత్రి తనిఖీ.
అంతకు ముందు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ రూ. 34 కోట్లతో నిర్మిస్తున్న ఆసుపత్రి నూతన భవనాన్ని క్షుణంగా పరిశీలించారు. కొత్త భవనంతో ప్రజలకు మరిన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, చిన్న చిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిసిహెచ్ఓ డా. రాజశేఖర్, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
