Take a fresh look at your lifestyle.

రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి

  • హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు త్వరగా అనుమతులు ఇవ్వండి.
  • నగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలి.
  • దక్షిణ భాగాన్ని భూసేకరణ చేయకపోతే వ్యయం పెరిగే ప్రమాదముంది.
  • భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
  • తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలి.
  • ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు పూర్తి మద్దతు ఇస్తాం.
  • ప్రధానికి సీఎం రేవంత్ వినతి.

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.అక్కడ నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం మీటింగ్ ముగిసిన తర్వాత మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఇందులో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు.ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన సీఎం వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానమంత్రిని కోరారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అందుకు పట్టణాభివృద్ధిశాఖను ఆదేశించాలని కోరారు.గతంలో నిర్మించిన 69 కి.మీ ఫేజ్-I తరువాత నగర విస్తరణకు అనుగుణంగా 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం ఉందన్నారు.ఇటీవల కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఒకేసారి ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.ఇప్పటికే భూ సేకరణలో పురోగతి ఉన్న ఉత్తర భాగం పూర్తయ్యేలోపు దక్షిణ భాగాన్ని చేపట్టకపోతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు.భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.రీజినల్ రింగ్ రోడ్డు కు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి కూడా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు.సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రముఖ ఆర్ అండ్ డీ కేంద్రాలు, మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.తెలంగాణ ప్రతిపాదించిన ఐఎస్ఎం ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.హైదరాబాద్ మొదటి నుంచి రక్షణ రంగంలో కీలకంగా ఉంటోన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అవసరమన్నారు.హైదరాబాద్– బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ, ఎంఎస్‌ఎంఈలో ప్రాజెక్టులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.ఇందుకు అవసరమైన అనుమతులు వేగంగా ఇచ్చేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. వచ్చే ఏడాది డిఫెన్స్‌ ఎక్స్‌పోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.రక్షణ రంగ ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి కోరారు.ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు సమానంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.