Take a fresh look at your lifestyle.

రైతు భరోసాపై మళ్లీ మాట తప్పారు 

  • ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.
  • మార్చి 31 దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు.
  • ఇంకా ఎన్నిసార్లు రైతులను మోసం చేస్తారు.
  • డేట్​లు మారుతున్నాయి..డెడ్​లైన్​లు మారుతున్నాయి.
  • రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు.
  • మాజీ మంత్రి హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: డేట్లు మారుతున్నాయి..డెడ్ లైన్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను మాత్రం నిలుపుకోలేకపోతున్నదని మాజీ మంత్రి హరీశ్ ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు మాత్రం మరింత బల హీనంగా ఉంటున్నాయని విమర్శించారు.మాటలు కోటలు దాటితే..అడుగు గడప కూడా దాటడం లేదని  మండిపడ్డారు,రేవంత్ మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు మరోసారి చేదు అనుభవమే ఎదురైందని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా రైతులను  ఇంకా ఎన్ని సార్లు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.రైతు భరోసాపై  కాంగ్రెస్ ప్రభుత్వం తరుచూ మాట తప్పుతోందన్నారు. దీంతో రైతు భరోసా కింద నిధుల కోసం రైతులు ఎదురుచూడడమే తప్ప..వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు.ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం..మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని  విరుచుకుపడ్డారు.మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. చివరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. కానీ రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా  పడలేదని ఎక్స్ వేదికగా హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతు భరోసాను మొదట్లో దసరాకిస్తమన్నారని..కానీ ఇవ్వలేదన్నారు.అలాగే  సంక్రాంతికి అన్నారు..తాజాగా ఉగాదికి  ఇస్తామని రైతులను ఊరించారన్నారు. తెలుగు కొత్త సంవత్సరమే  రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు.బీఆర్ఎస్  హాయంలో కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదని విమర్శించారు.మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నాడని మండిపడ్డారు..రుణమాఫీని దారుణ వంచనగా మార్చిండని ఆరోపించారు. అందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పినట్లు, అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్లుగా రైతులందరి కీ రుణ మాఫీ చేసే దాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బీఆర్ఎస్ పార్టీ  మాత్రం వదిలిపెట్టడని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రేవంత్ ను, కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుందన్నారు. ఎక్కడిక్కడ నిలదీస్తూ,  కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.