ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెదక్ పట్టణం ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి నుండి ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియను యాప్ ద్వారా చేస్తామన్నారు. ఈ ప్రక్రియ రెండు రోజుల పాటు మెదక్ పట్టణంలోని 7, 20, 21 ,22 వార్డుల్లో కొనసాగుతుందన్నారు.
వార్డ్ ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ప్రక్రియ చేపడుతుందన్నారు.
నిర్ధారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మరణించిన వారిని పెన్షన్ పథకం నుండి తొలగించడానికి, పెన్షన్ పొందుతున్న వారిని నిర్ధారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు, సర్ఫ్ డైరెక్టర్ సోషల్ సెక్యూరిటీ గోపాల్, ప్రాజెక్టు మేనేజర్ గోవర్ధన్ టి.జి ఆన్లైన్, కృష్ణంరాజు, మృనాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీఘనాపూర్ మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
పలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం కలగలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సింధు రేణుక ,స్థానిక సర్పంచ్, పిహెచ్సి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.