ఎంపీ ల్యాండ్స్ నిధులతో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: ఎంపీ డాక్టర్ మల్లు రవి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మల్లు రవి ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 31 వేల వ్యయంతో ఈ ట్రైసైకిళ్లు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు ట్రైసైకిళ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, తన ఎంపీ నిధులను సంక్షేమం మరియు విద్యాభివృద్ధికి ప్రాధాన్యతగా వినియోగిస్తానన్నారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలంటే దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
దివ్యాంగులు దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు వంటి సహాయక పరికరాలు వారి స్వతంత్ర జీవనానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ పరికరాల ద్వారా దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగగలరని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా డిడబ్ల్యూఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.