Take a fresh look at your lifestyle.

ఈ నెలలోనే రైతు భరోసా రెండో విడుత నిధుల సర్దుబాటుకు సీఎం ఆదేశం

రూ. 2,650 కోట్లకు గ్రీన్ సిగ్నల్
కొత్తగా అప్లై చేసిన వారికి కూడా విడుదల

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. కాగా, రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లో జమ చేయనుందో స్పష్టం చేసింది. దీంతో, రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకు రిలీఫ్ దక్కనుంది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ తాజాగా రైతుల భరోసా నిధుల పైన సమీక్ష చేసారు. రైతులకు ఇచ్చిన హామీ విధంగా నిధులు జమ చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటుగా రైతులకు భరోసా కింద అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేసారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందనున్నారు.
రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైతులకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులను మరో రెండు విడతల్లో ఈ నెలలోనే జమ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే మార్చిలో ఒక విడత నిధులు జమ చేశారు. ఇప్పుడు రెండో విడతను వారం పది రోజుల్లో విడుదల చేస్తారు. మిగతా సొమ్మును ఈ నెలాఖరుకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు. గతంలో అమలైన రైతు బంధు పథకంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న రైతు భరోసా పథకంలో ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. గతంలో ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పన్నెండు వేలకు పెంచారు. అంటే ప్రతి సీజన్‌కు ఆరువేల రూపాయల చొప్పున రైతులకు అందజేస్తున్నారు.

మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు
రాష్ట్రంలో ఈ సీజన్ కోసం మొత్తం 9వేల కోట్లను మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో మార్చి 23నుంచి 3590 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు. రెండో విడతను ఏప్రిల్ రెండో వారంలో 2650 కోట్లను విడుదల చేయనున్నారు. ఇందులో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. మూడో విడతను ఏప్రిల్ చివరి నాటికి 2, 760 కోట్లను విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నందున వీటిని జమ చేసే విధానంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం గతంలో తక్కువ భూమి ఉన్న వారికి ముందుగా డబ్బులు వేసే వారు. దీంతో మిగతా వాళ్లకు ఎప్పుడో వచ్చేవి. ఇప్పుడు దానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పుడు భూమి ఎంత ఉన్నా సరే మొదటి ఎకరాకు సంబంధించిన ఆరు వేల నిధులను ఒకేసారి విడుదల చేస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులకు ఒకేసారి లబ్ధి జరుగుతుంది.

కొత్త అప్లకేషన్లకు కూడా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమన్వయం చేస్తూనే రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దశల వారీగా పంపిణీ ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగానే కేవలం సాగు అవుతున్న వ్యవసాయం భూములకు మాత్రమే ఈ సాయం అందిస్తున్నారు. భూభారతిలో నమోదు అయిన భూములకే సాయం అందుతోంది. ఇప్పుడు ఫిబ్రవరిలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు అందుతున్న వేల మంది రైతులకు కూడా సాయం అందజేయనుంది. అయితే వీళ్లంతా ఏప్రిల్ 25 లోపు ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలను ఏఈవోకు అందజేయాలి. రైతులు తమ నిధుల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. రైతు భరోసా అధికారిక వెబ్‌సైట్‌ rythubharosa.telangana.gov.in సందర్శించాలి. స్టాటస్ చెక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌లేదా రిజిస్టర్డ్ వివరాలు నమోదు చేయాలి. దీని ద్వారా మీ ఖాతాలో నగదు జమ అయిందా లేదా అని తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.