హైటెక్ సిటీలో ‘హై’టెక్ ఆక్రమణ
20 కోట్లకు పైగా విలువైన ఆక్రమణల అంచనా.. గజం రూ.2 లక్షల పైమాటే
రోడ్లు ఆక్రమణ- అక్రమ నిర్మాణాలు
అనుమతులే లేవు…ఆ పై ఏడంతస్థులు
ఫిర్యాదులపై అధికారుల మౌనం – చోద్యం చూస్తున్న వైనం
20 కోట్ల అక్రమాల వెనుక అసలు కథ
ముద్ర న్యూస్ :
భాగ్యనగరానికి హైటెక్ సిటీ గుండె కాయ… తెలంగాణాకే ఒక బ్రాండ్..సాఫ్ట్ వేర్ రంగానికి ఓ ల్యాండ్ మార్క్…వ్యాపార, వాణిజ్య వర్గాలకు అదో బూస్టర్…అంతే కాదు అవినీతి అధికారులకూ ఓ కల్పతరువు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందాక మాదాపూర్ ప్రాంతానికి ఊహించని డిమాండ్ పెరిగింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు,,,వాటిల్లో లక్షల రూపాయల వేతనాలతో వివిధ ప్రాంతాల నుండి పనిచేసే ఉద్యోగులు….ఉద్యోగుల విలాసవంతమైన జీవితం కోసం చేసే ఖర్చులతో ఇక్కడి వ్యాపారులే కాదు… యాజమానులు పూర్తిగా కమర్షియలే…అందుకు ఉదాహరణే హైటెక్స్ కు ఆనుకుని ఉన్న ఇజ్జత్ నగర్ లో కొందరు ఇంటి యజమానుల తీరు.
వివరాల్లోకి వెళితే… ఇంటి నెం.2-15 లో గత కొంత కాలంగా రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కాలనీకి దినదినమూ డిమాండ్ పెరగడంతో ఆ రేషన్ షాపు ఇంటి యజమానికి తన ప్లాట్ కు ఆనుకుని ఉన్న రోడ్డు ఆక్రమణకు శ్రీకారం చుట్టాడు. తనకున్న కొద్ది పాటి స్థలానికి రోడ్డు ఆక్రమించుకోవడంతో సుమారు 400 గజాలకు అతని ప్లాట్ విస్తరించింది. రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు నిర్మాణ అనుమతులు లేకుండానే గత సంవత్సర కాలం నుండి ఒక అంతస్థుపై మరో అంతస్థు నిర్మిస్తూ ఏడవ అంతస్థు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎనిమిదవ అంతస్థు నిర్మాణం కొనసాగుతోంది.
ఈ విషయమై శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ లో గతేడాది కళ్లెం ఉమాకాంత్ రెడ్డి అనే సిటిజన్ ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం…ఇదిగో వెళుతున్నా…అదిగో నోటీసులు ఇచ్చామంటూ సంవత్సర కాలం గడిపేసారు. ఇదే అదనుగా భావించిన అదే ముఠాలోని కొందరు సభ్యులు రేషన్ దుకాణానికి మరో వైపు ఉన్న రోడ్డుకు సైతం టెండర్ పెట్టారు. ఆ దారిలో వాహన రాకపోకలు ఎక్కువ లేకపోవడం అక్రమార్కులకు దానిని సైతం ఆక్రమించేందుకు వెనకాడటం లేదు. ఇజ్జత్ నగర్ లో జరుగుతున్న ఆక్రమణలపైనా డిప్యూటి కమిషనర్ కు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోలేకపోయారు. భవన నిర్మాణ పనులు బహిరంగా జరుగుతున్నప్పటికీ ఆపలేకపోతున్నారు.

ఆక్రమణ…అక్రమ నిర్మాణాల విలువ 20 కోట్లకు పైనే….
మాదాపూర్ లోని ఇజ్జత్ నగర్ లో ప్రస్తుతం గజం ధర సుమారు రూ.రెండు లక్షలపైనే. రేషన్ షాప్ యాజమానుల బృందం ఆక్రమించిన స్థలం సుమారు 500 గజాల నుండి 600 గజాల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అంటే స్థల వ్యయం, అక్రమ నిర్మాణాల వ్యయం కలిపితే సుమారు 20 కోట్ల రూపాయల పైమాటే. హైదరాబాద్ భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు పరిపాటే అయినప్పటికీ ఇలా రోడ్లను ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలు చేయడం స్థానికుల విచ్చలవిడి తనానికి పరకాష్ట అని చెప్పుకోవాలి.

నోటీసులు ఇచ్చాము…
ఆక్రమణ, అక్రమ నిర్మాణాల విషయమై శేరిలింగంపల్లి అసిస్టెంట్ కమిషనర్ కరుణాకర్ ను ‘ముద్ర’ సంప్రదించగా స్పందించలేదు. మరో ప్రయత్నంగా డిప్యూటి కమిషనర్ ఎన్.బాలక్రిష్ణను ‘ముద్ర’ సంప్రదించగా ”ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. జీహెచ్ ఎంసీ పునర్విభజన వలన సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది అలాట్ అయ్యాక ప్రత్యక్ష్య కార్యాచరణ చేపడతాం” అన్నారు.