Take a fresh look at your lifestyle.

గో సంరక్షణకు ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి …..పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు, బృందంతో భేటీ

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికలు రూపొందించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్నిఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ఆలయాల సమీపంలో కూడా గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు మేనకా గాంధీ, ఆమె బృందం సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం అసెంబ్లీ సమావేశ హాలులో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీకి వివరించారు. మున్సిపాలిటీల వ్యాప్తంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ ప్రక్రియ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జంతువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న క్షేత్రస్థాయి చర్యలను అధికారులు మేనకా గాంధీ బృందానికి వివరించారు. జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను ఆమె అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించడంతో పాటు జంతువుల సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధతను ఈ సందర్భంగా మేనకా గాంధీ కొనియాడారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.