ఎమ్మెల్యే నియోజకవర్గాలపై సర్కార్ చిన్నచూపు
మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని సొంత ప్రభుత్వాన్ని విమర్శించారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు.. తాము మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని మండిపడ్డారు. మరోవైపు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఎత్తిపోతల పధకాలను హుజూర్‌నగర్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్న రాజగోపాల్ రెడ్డి.. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా ఉందన్నారు. అయితే నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.