Take a fresh look at your lifestyle.

ఫార్ములా–ఈ అవినీతి కేసు: కేటీఆర్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

  • ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ ప్రాసిక్యూషన్‌
  • ఏసీబీకి కేంద్రం అనుమతి
  • ఇప్పటికే కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్   
  • ఛార్జిషీట్‌ దాఖలుకు సిద్ధమవుతోన్న ఏసీబీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రాసిక్యూషన్ చేసుకోవచ్చని రాష్ట్రానికి సూచించింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు సైతం ఇప్పటికే గవర్నర్ నుంచి అనుమతి లభించింది. రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో ఏసీబీ అధికారులు వారిపై ఛార్జిషీట్‌ దాఖలుకు సిద్ధమవుతున్నారు. దాదాపు తొమ్మిది నెలలు ఈ కేసుపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు గతేడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ను కలిసిన అధికారులు ఆయనతో కీలక అంశాల గురించి చర్చించారు. కేసులో నిందితులుగా ఉన్న వారిపై చార్జిషిట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ఇప్పించాలని కోరారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఏ2 సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ4, ఏ5ల‌పై చార్జ్‌షీటు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేటీఆర్ విచారణకు గవర్నర్ గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అరవింద్‌ను మూడు సార్లు విచారించారు. తాజా పరిణామంతో ఈ కార్ అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్నది. ఫార్ములా ఈ-కారు రేస్‌లో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ ఇప్పటికే నిగ్గు తేల్చింది. కేసులో క్విడ్‌ ప్రోకోను అధికారులు స్పష్టమైన సాక్షాధారాలతో నిరూపించింది. ఫార్ములా ఈ-రేసు కోసం స్పాన్సర్‌షిప్‌ ఇచ్చిన సంస్థ నుంచి రేసు నిర్వహించిన సంస్థకు రూ.44 కోట్లు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించారు. అందుకు బదులుగా స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌‌ను బీఆర్ఎస్ తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.