Take a fresh look at your lifestyle.

సమన్వయం – సాంకేతికతతోనే సక్సెస్ సాధన -డీజీపీ శివధర్ రెడ్డి

 

సైబరాబాద్ పోలీస్ 23 ఏళ్ల ప్రస్థానం.. అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక గుర్తింపు

టీ హబ్ లో పూర్వ సీపీలకు సన్మానం

ముద్ర, శేరిలింగంపల్లి :

సైబరాబాద్ పోలీస్ సేవల 23 ఏళ్లు… ఆధునిక పోలీసింగ్‌కు ప్రతీకగా ఎదిగిన సైబారాబాద్ కమిషనరేట్
24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం టీ-హబ్‌లో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరుకాగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్‌తో పాటు మాజీ కమిషనర్లు, సీనియర్ రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. మాజీ డీజీపీ డా. ఎం. మహేందర్ రెడ్డి, ఎస్. ప్రభాకర్ రెడ్డి, ద్వారకా తిరుమలరావు, స్పెషల్ హోం సెక్రటరీ సీవీ ఆనంద్, వి. నవీన్ చంద్ర, సందీప్ శాండిల్యా తదితరులు కమిషనరేట్ అభివృద్ధి ప్రయాణాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ కమిషనర్లు మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్ అమలు చేయడం ద్వారా సైబరాబాద్ పోలీస్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు. ప్రజలతో సాన్నిహిత్యం, పారదర్శకత, వేగవంతమైన సేవలే సమర్థ పోలీసింగ్‌కు బలమని పేర్కొన్నారు.

డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్‌లో సేవలందించిన అధికారులు కట్టుదిట్టమైన పనితీరు, సమర్థతతో కమిషనరేట్‌కు విశిష్ట స్థానం తీసుకువచ్చారని, అంతర్జాతీయ స్థాయిలో కూడా సైబరాబాద్ పోలీసింగ్‌కు గుర్తింపు లభించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. మాజీ డీజీపీ డా. మహేందర్ రెడ్డి 2003 మెట్రోపాలిటన్ చట్టం కింద కమిషనరేట్ ఏర్పాటుతో ఆధునిక పోలీసింగ్‌కు బలమైన పునాది పడిందని గుర్తుచేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం.b రమేష్ మాట్లాడుతూ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందిన సైబరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలతో సమన్వయం, సైబర్ భద్రత బలోపేతం, సాంకేతిక వినియోగం ద్వారా ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ చరిత్ర, ముఖ్య విజయాలు, ప్రాధాన్య కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక స్లైడ్ షోను ప్రదర్శించగా, అనంతరం అతిథులను సన్మానించారు.
మొత్తంగా రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రయాణంలో సాంకేతికత, సమన్వయం, ప్రజా సేవలను ఆధారంగా చేసుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధునిక పోలీసింగ్‌కు ఒక ప్రమాణంగా నిలుస్తోందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.