‘పురు’పోరు తర్వాత ఇంటిపన్ను పెంపు
ముద్ర, కరీంనగర్ :
మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటిపన్ను పెంపునకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా విడుదల చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఉపయోగం లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారని ఆరోపించారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని అన్నారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే అని చెప్పారు. తాను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత తనదన్నారు. గంగుల కమలాకర్ కు మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.