ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువకు వచ్చింది. మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 3.71 టీఎంసీలు డెడ్ స్టోరేజీలో ఉంటుంది. మిగిలిన నీటిని మాత్రమే గ్రావిటీ ద్వారా విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 4.212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే 3.71 టీఎంసీలు డెడ్ స్టోరేజీ పోను విడుదల చేసుకోవడానికి వీలుగా 0.5 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా విడుదల చేస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది.
గడిచిన కొన్నేళ్లతో పోల్చితే ఈసారి కృష్ణానదికి ఎక్కువ వరద రోజులు నమోదయ్యాయి. జూన్ నుంచి మొదలుకుని నవంబరు వరకు ఎగువ ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఒక పంట కాలం మొత్తం వరద రోజుల్లోనే పూర్తయ్యింది. వానాకాలం పంట పూర్తయిన తర్వాత కూడా ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో జూరాల కుడి,ఎడమ కాలువల మీద ఆదారపడిన పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 15 వరకు ఆయకుట్టుకు సాగునీరు అందిస్తామని గత నెలలో ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రకటించారు. చెప్పిన టైం కంటే వారం రోజుల ముందే నీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాలను వృధా కాకుండా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల పైన ఉందన్నారు కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు వందల టీఎంసీ ల నీరు సముద్రం లోకి వృధాగా పోతుందని, ఈ నీటిని ఎలా సద్వినియోగ పరచుకోవాలనే అంశం పై ఇరువురు మంత్రులు సుధీర్ఘంగా చర్చించారు. కృష్ణా జలాలను కాపాడుకోగలిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చవచ్చని అభిప్రాయపడ్డారు.
జూరాల అడుగంటుతున్న నీటి మట్టాని దృష్టిలో పెట్టుకుని త్రాగు నీటి అవసరాల కోసం 5 టిఎంసీల నీరు విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని గద్వాల, వనపర్తి జిల్లాల తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కర్నాటక అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూరాల ప్రాజెక్టులో 9.657 టిఎంసిలకు గాను 4.212 టిఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎండకాలం సీజన్ ప్రారంభమైనప్పటికి మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి ఇలా కొనసాగితే రానున్న మే, జూన్, జూలై నెలల్లో కూడా త్రాగు నీటికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకుల అభిప్రాయం. ఒక వేళ కర్ణాటక ప్రభుత్వం 3 నుంచి 5టీఎంసీల విడుదల చేస్తే తాగునీటికి డోకాలేకపోవచ్చు.
ప్రశ్నార్థకంగా నెట్టెంపాడు
జూరాలలో నీటి మట్టం గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో జూరాల మీద ఆదారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ లు ద్వారా సాగు నీరు ప్రశ్నార్థకంగా మారింది. జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకొని జూరాల కుడికాలువ, ఎడమ కాలువల ద్వారా వారబందీ విధించి త్రాగు, సాగుకు నీరందిస్తున్నారు. పంట చివరి దశలో ఉండటంతో మరో వారం రోజులు సాగునీరందిస్తే గట్టేక్కే పరిస్థితి ఉందని ఆయకట్టు రైతులు పేర్కొన్నారు.
పంటలపై ప్రభావం..
జూరాల కుడి, ఎడమ కాలువల కింద యాసంగి సీజన్ పంటలు చేతికి రావడానికి ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కంకి దశలో 50 శాతం పొలాలు ఉండగా.. 50 శాతం పొట్ట దశలో ఉన్నాయి. కంకి వేసిన పొలాలకు మరో వారం రోజులపాటు నీటి తడి ఇస్తే సరిపోయే అవకాశం ఉంది. పొట్ట దశలో ఉన్న పొలాలకు ఈ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జూరాల ఎడమ కాలువ ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.