హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా:
హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 116 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగిల్ బెడ్‌రూమ్ ఇండ్లతో ఈ కాలనీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
మంగళవారం సాయంత్రం మంత్రి కాలనీ పనులను పరిశీలించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
మోడల్ కాలనీ కోసం భూమిని 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో దేవాదాయ శాఖ నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో పనులను నిలిపివేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు.
భూమి వ్యయం మినహాయించి నిర్మాణానికి రూ.125 కోట్లు ఖర్చు చేయగా, అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, మరో రూ.10 కోట్లతో అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, క్రీడా మైదానం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెలాఖరులో కాలనీ ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశముందని, ముందుగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. తొలి విడతలో 1500 మందిని ఎంపిక చేస్తామని వెల్లడించారు.
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ సిఫార్సులకు ఆస్కారం లేదని, అర్హులైన వారికే ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. అనర్హులను సిఫార్సు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల్లో ఎలాంటి అపోహలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లబ్ధిదారుల జాబితా పట్ల ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచించారు.
హుజూర్నగర్‌కు ఐకాన్‌గా నిలిచే ఈ మోడల్ కాలనీ ద్వారా పేదలకు గౌరవప్రదమైన నివాస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.