- కన్నుల పండువగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
ముద్ర తెలంగాణ బ్యూరో: హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశమ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాడు ధన్వంతరి సహిత సుదర్శన హోమం జరిగింది. సాయంత్రం స్వామివారిని కనకమామిడి గ్రామ వీధుల్లో ఊరేగించారు.
గురువారం నాడు ఉదయం స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.
సాయంత్రం లక్ష పుష్పార్చన, పుష్ప యాగం నిర్వహించారు. కనకమామిడి గ్రామంతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు వందలాది సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బ్రహ్మోత్సవాలను తిలకించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.