Take a fresh look at your lifestyle.

భూ భారతికి ఆమోదం… గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన గవర్నర్

  • అమలుకు సర్కారు సన్నాహాలు
  • ఇకపై భూ సమస్యలకు శాశ్వత‌ ప‌రిష్కారం
  • తహసీల్దా­ర్లకు అధి­కా­రాలు
  • ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి
  • మెరుగైన, సమగ్ర రెవెన్యూ సేవలకు రూపకల్పన
  • భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : భూ భారతి చట్టానికి ఆమోద ముద్ర పడింది. ప్రజాప్రభుత్వం తీసుకురానున్న చారిత్రక చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై ధరణీ స్ధానంలో భూభారతి అమలుకు మార్గం సుగుమమైంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణీ చట్టాన్ని గత నెల 20న అసెంబ్లీ వేదికగా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం దానికి స్ధానంలో భూ భారతి కి ఆమోదం తెలిపింది. మరుసటి రోజు శాసనమండలిలో ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో వెంటనే గవర్నర్​ ఆమోదం కోసం వెళ్లగా.. తాజాగా గురువారం దానికి ఆమోదం లభించింది. ఇదీలావుంటే ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల పోర్టల్​ ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి రానున్నది. కాగా శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్​ ప్రభుత్వం ధరణిని రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. దాని స్థానంలో కొత్త పోర్టల్​ను తీసుకొస్తామని చెప్పి భూభారతి పోర్టల్​ ఏర్పాటు ప్రక్రియలను పూర్తి చేసింది.

ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో కూడిన ధరణి కమిటీ పలు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేసింది. అలాగే వివిధ శాఖలతో సమీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.అనంతరం ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం 18 రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ఆర్వోఆర్​ చట్టాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు చరమగీతం పాడేందుకు అవసరమైన అన్ని రకాల సెక్షన్లను చట్టంలో చేర్చేందుకు ప్రణాళిక రచించి నిర్ణయించింది.ఆగస్టులో డ్రాప్ట్​ను సిద్ధం చేసి వివిధ వర్గాల సలహాలు,అభిప్రాయాలు స్వీకరించారు. ఈ చట్టంపై దాదాపు 11 నెలల పాటు నిపుణులు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. చివరికి 21సెక్షన్లతో డ్రాప్ట్​ను సిద్ధం చేయగా..వాటిలో 19సెక్షన్లు వివిధ క్లాజులకు సంబంధించినవి కావడం విశేషం.

కోర్టు మెట్లెక్కాల్సిన పని లేకుండా..

భూ పరి­పా­ల­నలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో పర్య­వే­క్షక వ్యవస్థ ఉండా­లన్న నిర్ణ­యా­నికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు, భూమి సమ­స్యల పరి­ష్కా­రా­నికి రైతులు కోర్టుల మెట్లు ఎక్కా­ల్సిన అవ­సరం లేకుండా అధి­కా­రుల స్థాయి­లోనే పరి­ష్కారం అయ్యే మార్గా­లను పరి­శీ­లిం­చారు.

భూ భార­తి­లో తహసీల్దా­ర్లకు అధి­కా­రాలు

ధరణి చట్టంలో భూమి సమ­స్యను పరి­ష్క­రిం­చ­డా­నికి అధి­కా­రు­లకు ఎలాంటి అధి­కా­రాలు లేవు. ఎలాంటి అధి­కా­రాలు కూడా లేకుండా కలె­క్టర్, సీసీ­ఎల్ఏలు పని చేశా­రు. భూ భారతి చట్టంలో తాసి­ల్దార్ మొదలుకొని.. కలె­క్టర్ వరకు సమ­స్య­లను పరి­శీ­లించి, పరి­ష్క­రించే అధి­కా­రాలు ఉండడం విశేషం. తాజాగా చట్టంతో ప్రభుత్వం ఎంత సమ­ర్థ­వం­తంగా అమలు చేస్తే ప్రజ­లకు అంత మేరకు సత్వర న్యాయం జరిగే అవకాశాలున్నాయి.

నాడు కేంద్రీకృతం.. నేడు వికేంద్రీకరణ

ధరణి చట్టంలో అధి­కా­రాలు కేంద్రీకృతం చేయగా భూ భారతి చట్టం అధి­కా­రాలను వికేం­ద్రీ­క­రణ చేస్తు­న్నది. ధర­ణిలో కలె­క్టర్‌కు పరి­మిత అధి­కా­రాలు, ఆపైన సీసీ­ఎల్ఏ, లేదా సివిల్ కోర్టు మాత్రమే ఉండేది. పైగా గ్రామ స్థాయిలో ఉండే పర్య­వే­క్షక అధి­కారి (వీఆర్వో) వ్యవ­స్థను రద్దు చేసింది. కానీ కొత్తగా అమ­లు­లోకి రానున్న భూ భారతి చట్టంలో గ్రామ స్థాయిలో పర్య­వే­క్షక అధి­కారి ఉండా­లని స్పష్టం చేసింది. రైతులు కలె­క్టర్ వద్దకో.. కోర్టుల చుట్టూ­తనో తిర­గా­ల్సిన అవ­సరం లేకుండా మండల స్థాయిలో తాసి­ల్దారే భూమి సమ­స్య­లను పరి­ష్క­రించే అవ­కా­శాన్ని కల్పిం­చింది. ఈ మేరకు తాసీ­ల్దార్ కు అధి­కా­రాలు అప్ప­గిం­చింది. ఆపైన ఆర్డీ­ఓకు పర్య­వే­క్షించే అధి­కారం కల్పిం­చింది. ఇలా తాసీ­ల్దార్ వద్ద పరి­ష్కారం కానీ సమ­స్య­లను ఆర్డీఓ వద్ద, అక్కడ పరి­ష్కారం కాకుండా కలె­క్టర్ వద్ద రివి­జన్ పిటీ­షన్ వేయించి పరి­ష్క­రిం­చు­కునే అవ­కా­శాన్ని భూ భారతి చట్టం కల్పి­స్తోంది. దీంతో రైతులు తమ భూమి సమ­స్యల పరి­ష్కారం కోసం ఎక్క­డె­క్క­డికో వెళ్లా­ల్సిన అవ­సరం లేకుండా స్థాని­కంగా పరి­ష్క­రించే అవ­కా­శాన్ని కొత్త ప్రభుత్వం కల్పిం­చ­ను­న్నది.

సాధ్యమైనంత త్వరగా అమల్లోకి భూ భారతి : మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన‌, సమగ్రమైన రెవెన్యూ సేవ‌లను సత్వరమే అందించాల‌న్న ఆశ‌యంతో భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ప్రజలంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమ‌మే ధ్యేయంగా ఈ చ‌ట్టాన్ని తీసుకువచ్చామన్న ఆయన దానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. గవర్నర్​ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి న‌వీన్ మిట్టల్ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి స‌చివాల‌యంలో అంద‌జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిల్లుకు ఆమోదం లబించడంతో వీలైనంత త్వరలో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత‌ ప‌రిష్కారం చూపేలా భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామ‌ని, ఈ చ‌ట్టంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ చ‌ట్టం -2020 తో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కోన్నారన్న పొంగులేటి భూ సమస్యలేని గ్రామం తెలంగాణ‌లో లేదన్నారు. గ‌త ప్రభుత్వం త‌మ వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవ‌స్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి తమప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. గ్రామాల్లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌డానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామనీ దానికి సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కివ‌చ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ప‌నిచేస్తోందనీ ప్రభుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌నిచేయాల్సిందేనన్నారు. ప్రజాపాల‌న‌లో ప్రజ‌లు కేంద్రబిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచ‌న‌లు ఉంటాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్రజ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.