Take a fresh look at your lifestyle.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ-అసెంబ్లీ సీట్ల 50% పెంపు: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సవరణలు 2029 ఎన్నికలకి

50 శాతం పెంపు
దేశ వ్యాప్తంగా డీలిమిటేషన్
రాష్ట్రంలో 60 మేరకు అసెంబ్లీ స్థానాలు అదనం
26కు పెరుగనున్న పార్లమెంట్ స్థానాలు
మహిళలకు ఎక్కువ సీట్లు
లోక్ సభ సెషన్ లో మహిళా బిల్లు
జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్వీభజన

ముద్ర, తెలంగాణ బ్యూరో :
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బిల్లు అమలైతే లోక్‌సభ స్థానాలు 816కి, అసెంబ్లీ స్థానాలు 6,185కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన కనుక అమలైతే, లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి పెరుగుతుంది. దేశంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 4,123 నుండి 6,185కి పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు వీలుగా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేసి, కేంద్రం అడుగులు సైతం వేస్తోంది.

ఏపీ, తెలంగాణలో ఎన్ని స్థానాలు..
కేంద్రం నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్యం భారీగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 స్థానాలు 26కి పెరుగుతాయి. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుండి 179కి చేరే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు విపక్షాలతోనూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి, ఆ లెక్కల ఆధారంగానే 2029 ఎన్నికల నాటికి ఈ కొత్త సీట్ల పెంపును అమలు చేయాలని మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే ఉత్తరాది, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యంలో వ్యత్యాసం వస్తుందన్న ఆందోళన కొనసాగుతోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు మేర పెంచాలని కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు మంగళవారం నాడు భేటీ కానున్నాయి.

లోక్‌సభ స్థానాలు ఏ రాష్ట్రంలో ఎన్ని..
50 శాతం మేర లోక్‌సభ సీట్లు పెంపు జరిగితే కనుక ఎక్కువ ప్రయోజనం ఉత్తరప్రదేశ్‌కు కలుగుతుంది. యూపీలో 80 ఉన్న లోక్‌సభ సీట్లు 120 అవుతాయి. ఇందులో 40 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. మహారాష్ట్ర సీట్లు 48 నుండి 72కి పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్ 42 నుండి 63కి, బీహార్ 40 నుండి 60కి, ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కి చేరతాయి. తమిళనాడులో లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుండి 59కి, మధ్యప్రదేశ్ లోక్‌సభ సీట్లు 29 నుండి 44కి పెరుగుతాయి.
చిన్న రాష్ట్రాలలో, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 2 నుండి 3కి పెరగవచ్చు. ప్రస్తుతం ఒక్కో సీటు ఉన్న మిజోరం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలకు 2 సీట్లు చొప్పున వచ్చే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీలో లోక్‌సభ సీట్లు 7 నుండి 11కి, జమ్మూ కాశ్మీర్ సీట్లు 5 నుండి 8కి పెరుగుతాయి. లడఖ్, పుదుచ్చేరి వంటి ఒకే సీటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

2029 ఎన్నికల నుంచే మార్పులు చేర్పులు..
2023 సెప్టెంబరులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2034 నుండి అమల్లోకి రావాలి. రాజ్యాంగంలోని అధికరణలు 170(3), 81(3) నిబంధనల మేరకు, 2026 తర్వాత వెలువడే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే, తాజా పరిణామాల ప్రకారం 2027 మార్చి 1 నాటికి జనగణన ప్రక్రియ పూర్తి కానుంది. వెంటనే నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టే అవకాశం ఉంది. తద్వారా రిజర్వేషన్ల అమలును అనుకున్నదానికంటే ముందే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ప్రారంభించింది.

Leave A Reply

Your email address will not be published.