ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఊరూరా, వాడవాడలా ఘనంగా నిర్వహించాలని గౌడ జనహక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ వీరోచిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి చాటిచెప్పాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్య క్రూర పాలనకు, జమీందార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. 1650లో ఖిలాషాపూర్ గ్రామంలో సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన ఆయన, అణగారిన వర్గాలను ఏకం చేసి మొఘల్ సైన్యాన్ని గడగడలాడించారని గుర్తు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసి, గెరిల్లా యుద్ధం ద్వారా మొఘలులకు ప్రధాన శత్రువుగా మారారు. ఖిలాషాపూర్, తాడికొండ, భువనగిరి వంటి చోట్ల కోటలు నిర్మించి సార్వభౌమాధికారాన్ని చాటారు. 1708లో వరంగల్ కోటను ఆక్రమించి విజయ పతాకం ఎగురవేశారు. ఆలయాల ధ్వంసాన్ని అడ్డుకుంటూ, మహిళల గౌరవాన్ని కాపాడుతూ ‘అపర శివాజీ’గా, ‘హిందూ ధర్మ పరిరక్షకుడు’గా ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో గౌడ కుల బాంధవులు, బహుజనులు ఐక్యంగా పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని వెంకటేష్ గౌడ్ కోరారు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో నడవడమే పాపన్న గౌడ్ కు మనం ఇచ్చే నిజమైన గౌరవమని ఆయన అన్నారు.