Take a fresh look at your lifestyle.

కమర్షియల్ గ్యాస్ కొరతతో కుదేలవుతున్న చిన్న వ్యాపారాలు

 
హోటల్లు, టిఫిన్ బండ్లు, స్వీట్ హౌస్‌లపై తీవ్ర ప్రభావం – ఉపాధి కోల్పోతున్న కార్మికులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చిన్న వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా హోటల్లు, టిఫిన్ బండ్లు, స్వీట్ హౌస్‌లు, మిర్చి బండ్లు గ్యాస్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వంటకు అవసరమైన గ్యాస్ లేకపోవడంతో చాలాచోట్ల షాపులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.

రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిన్న వ్యాపారులు ఈ పరిస్థితితో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే టిఫిన్ బండ్లు, చాట్ సెంటర్లు గ్యాస్ లేక పనులు నిలిపివేయాల్సి రావడంతో, అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. రోజుకు వచ్చే ఆదాయం లేకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

ఇక షాపుల యజమానుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు, షాప్ అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆదాయం లేక అప్పులు పెరుగుతున్నాయి.

కొంతమంది యజమానులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే అది కూడా అందరికీ సాధ్యం కాకపోవడంతో చాలా మంది షాపులను మూసివేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

ఈ పరిస్థితిపై వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి, చిన్న వ్యాపారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఈ సంక్షోభం మరింత తీవ్రమై వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.