– జిల్లా లోని వాగులను తోడేస్తున్న ఇసుకాసురులు
– రెవిన్యూ, పోలీస్, ప్రజా ప్రతినిధుల అండతో ఇసుక దందా
– మూడు ప్రొకేయిలైన్లు .. 30 లారీ లు అనే చందంగా సాగుతున్న ఇసుక రవాణా
– ఇసుక ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం రూ.లక్షలు సమర్పణ
– ఇసుక తరలింపు రోజు ఆయా మండల శాఖలకు రూ. రెండు నుంచి మూడు లక్షల వరకు మామూళ్లు
– ప్రజావాణి లో ఫిర్యాదు లతో బయటపడుతున్న ఇసుక బాగోతం
– ఫిర్యాదు లు వచ్చినా ఇసుక తరలింపును అడ్డుకోలేని జిల్లా యంత్రాంగం
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు మండలాల వాగులు.రెవిన్యూ, పోలీస్, ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ కాసులు దండుకుంటున్నారు.కూలీల తో పనులు చేయిస్తే ఇసుక దందా బయపడుతుందనే భయంతో మిసినరీలతో ఇసుక తరలింపు ను చేపడుతున్నారు. ఇందుకు, ప్రోక్లయిన్లు, బెంజ్ లారీ లను ఉపయోగించి ఇసుక ను ఇతర జిల్లా సరిహద్దు లను దాటిస్తున్నారు. ఈ తతంగమంతా వాగుల సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారుల కనుసన్నల్లో నడుస్తోంది. ఈ విషయాలు ప్రజావాణి ఫిర్యాదు ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్య లు లేవని వాగుల పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం మండల, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో జరిగే ప్రజావాణి కి ఇసుక తరలింపు విషయం పై వందలుగా ఫిర్యాదు లు వచ్చినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. వాగులు ఉన్న ప్రాంతాల మండల రెవిన్యూ, పోలీస్ యంత్రాంగానికి రూ. లక్షల్లో ముడుపులు అందుతున్నాయని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదుదారులు అంటున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి జిల్లా లోని భూత్పూర్, మూసాపేట, కోయిల కొండ, మిడ్జిల్ మండలాల్లో ఇసుకు దందాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఈ మండలాల్లో వేసవి వచ్చిందంటే చాలు వాగుల్లో ఉన్న ఇసుక పై అధికారుల అండతో అక్రమార్కులు రాబంధువుల్లా వాలుతున్నారు. భూత్పూర్ మండలం లోని మొల్గర వాగు నుంచి, మిడ్జిల్ మండలం దుందుబీ వాగు, మూసాపేట మండలం లోని పెద్ద వాగు,దేవరకద్ర నియోజకవర్గం లోని ఊకచెట్టి వాగు, నారాయణ పేట నియోజకవర్గం లోని కోయిల కొండ సూరారం వాగు ఇసుక తోడేళ్లకు ఇక్కడి ఇసుక కాసులు కురిపిస్తోంది.రాత్రి సమయం లో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాల్లో డంప్ చేసిన తరువాత అక్కడి నుంచి జిల్లా సరిహద్దులను దాటిస్తున్నారు. ఈ దందా అంతా చీకటిలో నే జరుగుతోంది. వాగుల్లో నీరు తగ్గిన వెంటనే ఇసుక తవ్వకం పనులు ప్రారంభమాయ్యయి. ఇప్పటికే ఈ ప్రాంతాల వాగుల్లో ఇసుక సాగానికి పైగా తరలించారు. ఇసుక తవ్వకాలపై వాగు పరిసర గ్రామాల ప్రజలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోయిల కొండ రెవిన్యూ అధికారులపై నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ నుంచి ఇసుక తరలించే రోజు రెవిన్యూ, పోలీస్ శాఖలకు రూ. రెండు నుంచి నాలుగు లక్షలు ముడుపులు అందుతున్నాయని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకోలేదు. గత సోమవారం భూత్పూర్ మండలానికి చెందిన పలువురు మొల్గర వాగులో ఇసుక తరలింపు పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. భూత్పూర్ పోలీసుల అండతో అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్నారని నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏకంగా ఇక్కడి ఎస్ ఐ అండదండలతో ఇసుక తరలింపు జరుగుతున్నదని ఈ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇక్కడే కాదు వాగులున్న ప్రతి మండలంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ మండలాల్లో ఎస్ ఐ, తహసీల్దార్ పోస్టింగ్ ల కోసం చాలా డిమాండ్ ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతాలకు పోస్టింగ్ వేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎస్ ఐ, తహసీల్దార్ పోస్ట్ కోసం రూ. ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పోస్టింగ్ వచ్చాకా ఇసుక తరలింపు లో వచ్చిన మామూళ్ళల్లో కూడా పోస్టింగ్ ఇప్పించిన వారికి వాటా ఉంటుంది. ఇది బహిరంగ రహస్యమే అయినా పట్టించుకునే జిల్లా అధికారులే కరువయ్యారు.జిల్లా పెద్ద వాగైనా దుందుబీ వాగు నుంచి ఇసుక తరలింపు జోరుగా ఉంటుంది.
అంతేకాకుండా 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన తరువాత అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు వివరాలు అందితే, వారి వివరాలను ముందుగానే మాఫియాకు చేరవేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థులు చేస్తున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వారిపై మాఫి యా గ్యాంగ్ బెదిరింపులకు దిగుతోంది. భారీగా ఇసుక తవ్వకాల కారణంగా వాగులు ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండటంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు లేకుండా పోతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఆధారమైన నేలలు ఇసుక మాఫియా దోపిడీకి బలవుతున్నాయనిరైతులు అంటున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన వారిని మాఫియా బహిరంగంగానే బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసుల అండ ఉందనే ధీమాతో మాఫియా సభ్యులు మరింతగా రెచ్చిపోతున్నారని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
……………………………………….
పడిపోతున్న భూగర్భ జలాలు :
………………………………………
పాలమూరు జిల్లా అంటేనే కరువు కు కేరాఫ్ గా ఉంది. ఈ కరువు జిల్లా లో భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.ఇక్కడి రైతులు అధికంగా బోరు బావుల పైనే ఆధారపడి పంటలు పండిస్తారు. ప్రధాన నీటి వనరులు ఇక్కడ బోరుబావులే. చెరువులు, కుంటలు ఉన్నా అవి వర్షా కాలానికే పరిమితం అవుతాయి. యాసంగి పంట సాగుకు బోరు బావులే ప్రధాన నీటి వనరులు. ఒక్క గద్వాల జిల్లా కు మాత్రం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుంది. మహబూబ్ నగర్ జిల్లా లో మాత్రం పంటల సాగుకు బోరుబావులే దిక్కు. ప్రస్తుతం వాగుల పరిసర గ్రామాల్లో ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.గత ఏడాది జనవరి లో గ్రౌండ్ లెవల్ 7.85 మీటర్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి 6.26 మీటర్లు గ్రౌండ్ లెవల్ గా ఉన్నాయి. 2024 కంటే 2025 లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అయినా భూగర్భ జలాలు ఇంత త్వరగా పడిపోవడానికి వాగుల్లో ఇసుక తరలించడమే అని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టక పోతే రానున్న రోజుల్లో సాగునీటి కి కే కాకుండా తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన అవస్థ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఇసుక రవాణాను అడ్డుకుని భూగర్భ జలాలను కాపాడాల్సిన అవసరం ఉంది.