ముద్ర మల్కాజిగిరి:
పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గుప్తా తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “ఎన్విరాన్‌మెంట్ సర్వీస్ వీక్” కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. “మన పరిసరాలు – మన బాధ్యత” అనే నినాదంతో పలు ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు.
ఈ సందర్భంగ ఎమ్మెల్సీ బొగ్గావరపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ, పరిసరాల సమాజంలో అవగాహన పెంచేందుకు లయన్స్ 320డి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.
స్వచ్ఛతను కాపాడేందుకు ప్రజలు పాటించాల్సిన ఐదు ముఖ్య సూత్రాలను ఆయన వివరించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో ఎరువు తయారు చేయడం, బహిరంగ మూత్ర విసర్జనను నివారించడం, ప్లాస్టిక్ బ్యాగుల బదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగులను వినియోగించడం, చెత్తను నాలాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నిరోధించడం, చెత్తను కాల్చకుండా గాలి కాలుష్యాన్ని నివారించడం వంటి అంశాలను పాటించాలని సూచించారు.
అలాగే “స్వచ్ఛ సర్వేక్షణ్-2026”లో మన జిల్లాను నంబర్ వన్ స్థానంలో నిలపడం లక్ష్యమని, ఇందుకోసం ప్రతి పౌరుడు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసి ఆచరణలో పెట్టాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 26న జిల్లా స్థాయిలో మెగా పర్యావరణ ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛతపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు లయన్స్ ఎన్విరాన్‌మెంట్ డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ లయన్ అన్నెం కోటిరెడ్డి తెలిపారు.
“ఇల్లు శుభ్రం – వీధి శుభ్రం – ఊరు శుభ్రం – దేశం శుభ్రం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.