ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల వివరాలను ప్రజలకు స్పష్టంగా అందించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఉపాధి సృష్టిలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి పథకాల ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ రుణాల మంజూరు వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఇప్పటికే ఆమోదం పొందిన రుణ దరఖాస్తులకు తగిన రుణాలు ఇవ్వకపోవడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు కేవలం రుణాలే కాకుండా వ్యాపార మార్గదర్శకత్వం కూడా అందించాలని సూచించారు.
జిల్లా అభివృద్ధిపై విస్తృత సమీక్ష నిర్వహించిన ఎంపీ, జాతీయ రహదారులు, రోడ్లు-భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఈడబ్ల్యూఐడీసీ పనులపై అధికారుల నివేదికలను పరిశీలించారు. మిషన్ భగీరథ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
విద్యారంగంపై సమీక్షిస్తూ పాఠశాలలు, ఇంటర్మీడియట్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఫలితాలు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు వసతి, ఆహారం, భద్రత కల్పించాలని సూచించారు.
ఆరోగ్యరంగంపై కూడా సమీక్షిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ఔషధాల సరఫరా, అత్యవసర సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రజలకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు.
గ్రామీణ అభివృద్ధి పనులు నిర్ణీత గడువుల్లో పూర్తి కావాలని, పనుల నాణ్యతపై రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు తీగల సునేంద్ర, శ్రీనివాసులు, దిశా కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.