Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా…?

 

కమ్యూనిస్టులు పరాన్న జీవులు అన్న ఆ పార్టీ ఎన్ని చోట్ల గెలిచింది..?
ప్రపంచంలో కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదు
బీఆర్ఎస్ మద్దతును మేం తిరస్కరించలేదు
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జత కట్టామనే మద్దతు తీసుకోలేదు
మీడియాతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కమ్యూనిస్టులు పరాన్న జీవులు, ఎక్కడా ఉన్నారని ప్రశ్నించిన బీజేపీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ఉంది? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. వామపక్ష భావాజాలాన్ని చులకనగా చేసి… మాట్లాడిన కాషాయ పార్టీ కొత్తగూడెంలో ఎక్కడ ఉందని చురకలంటించారు. పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ 41 స్థానాల్లో విజయం సాధించిన విషయాన్ని బీజేపీ ఇప్పటికైనా గమనించాలన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదని స్పష్టం చేశారు. కమ్యూనిజం అనేక దేశాల్లో చిగురిస్తుందని జోస్యం చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్ తొలిసారి సీపీఐకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్‌కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీపీఐకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అయితే బీఆర్ఎస్ మద్దతును తాము తిరస్కరించలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జత కట్టామన్న కూనంనేని.. ఆ కారణంతోనే బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉండాలని జాతీయ స్థాయిలో ఉందన్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం సీపీఐ ఒంటరిగా పోటీ చేసిందని తెలిపారు. సీపీఎం కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందని వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు బలం ఉన్న చోట్ల సీట్లు కాంగ్రెస్‌ను అడుగుతామని కూనంనేని అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేసిందని గుర్తుకుచేశారు. భవిష్యత్తులో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కనీసం ప్రాతినిధ్యం ఉండేలా నైనా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్నా.. ఎన్నికలు వస్తే పొత్తు కుదరడం లేదన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో నైనా ఆ తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ చూడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇది పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో పోటీ నుంచి తప్పుకోవాలని ఒక సీఐ సీపీఐ అభ్యర్ధికి తుపాకీ గురి పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఊరుకోం అని హెచ్చరించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలి మేయర్ సీపీఐ కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూనంనేని వెల్లడించారు. యువకుడు, సామాన్య ఆటో డ్రైవర్‌ను కొత్తగూడెం మేయర్‌ను చేశామని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో చతుర్ముఖ పోటీ జరిగిందన్న ఆయన.. సీపీఐ కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ 22 కార్పొరేటర్లను గెలవగా, సీపీఐ మద్దతు ఇచ్చిన ఒక ఇండిపెండెట్ విజయం సాధించారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.