- దేశ విదేశాలకు ఆదర్శం.
- చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌కు సమానమైన ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు.
- మిషన్ భగీరథతో దేశంలో తొలిసారి కోటి ఇండ్లకు సురక్షిత తాగునీరు.
- గ్లోబల్ టెక్ హబ్‌గా హైదరాబాద్.
- లండన్ బ్రిడ్జ్ ఇండియా ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం.
ముద్ర,తెలంగాణ బ్యూరో: ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం? అన్న అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు.అభివృద్ది, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను ఈ సదస్సులో ఆయన పంచుకున్నారు.సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందన్నారు.కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ అద్భుతంగా వివరించారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ తలసరి ఆదాయంలో 12వ స్థానం నుండి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణ నుండి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చన్నారు. తమ హయాంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి వ్యక్తుల కంటే విధానాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విప్లవాత్మక మార్పులను ఆహ్వానించడంతో పాటు నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందన్నారు కేటీఆర్.
ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్ కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతి సీజన్ కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టం అన్న కేటీఆర్, అందుకు కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకొని, ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామన్నారు.ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియాలో ప్రతి ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలో, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందన్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని ఇప్పటికీ అందించడం లేదన్నారు. తలసరి ఆదాయంలో 156 శాతం వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఒక్కటే అని అన్నారు. 2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ కేసీఆర్ ప్రగతిశీల విధానాలతో 2023 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారు.ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్, ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను అందుకే ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలన్నారు.అపార అవకాశాలను అందించడంతో పాటు కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ తెలంగాణ లైట్ హాజ్ లాంటిదన్నారు.ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు.తన ప్రసంగంతో తెలంగాణ సక్సెస్ జర్నీని సాధికారికంగా వివరించిన కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
Next Post