- 40 శాతం పేర్లను ఎంపిక చేసే అవకాశం.
- కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాబితా ఇవ్వలేదు.
- ఇందిరమ్మ ఇండ్లకు 2.10లక్షల మంది ఎంపిక.
- చెంచులకు 9200 ఇండ్లు ఇస్తున్నాం.
- ఐటిడిఏ పరిధిలోని నియోజక వర్గాలకు అదనంగా మంజూరు.
- మీడియాతో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల విషయంలో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు 40 శాతం పేర్లను ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మిగిలిన 60 శాతం ఎంపిక బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పజెప్పినట్లు చెప్పారు. లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇండ్లు కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలో కూడా 40 శాతం..అధికారులతో విచారించి ఇండ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.10 లక్షల మందిని ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. జూన్ 10 లోగా అర్హులైన మిగతా లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 42వేల ఇండ్లను మంజూరు చేశామన్నారు. వాటిలో ఇప్పటి వరకు 24 వేల ఇండ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి నిర్మాణం కోసం నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. సుమారుగా వంధ ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని తెలిపారు. మిగతా ఇళ్లను కూడా అతిత్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నేపథ్యంలో ధరల నియంత్రణకు ఒకటి రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తామని, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పని చేస్తుందన్నారు. స్టీల్ రేటు ఏడాది క్రితం నుంచి ఎలా ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలో కబ్జాలో ఉన్న వాళ్లకు పట్టాలు ఇచ్చి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.