Take a fresh look at your lifestyle.

భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత మహా సభలు ప్రారంభం దేశ నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధులు

 

ముద్ర,మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా పరిధిలోని ఘట్కేసర్ అన్నోజిగూడలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రం ఆడిటోరియంలో శుక్రవారం భారతీయ కిసాన్ సంఘ్ మూడు రోజుల అఖిల భారత ప్రతినిధి సభ ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి సంఘ అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


అఖిల భారత అధికారుల సమక్షంలో భారతమాత, భగవాన్ బలరాముడి చిత్రాల ముందు దీపప్రజ్వలన చేసి ప్రతినిధి సభను అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రాంత వివిధ రాష్ట్రాల కిసాన్ సంగ్ నాయకుల సమక్షంలో ప్రాంగణంలో ధ్వజారోహణ నిర్వహించి గోపూజ కార్యక్రమం నిర్వహించారు.
ప్రథమ సమావేశంలో అఖిల భారత అధ్యక్షుడు కె. సాయి రెడ్డి స్వాగత ప్రసంగం చేశారు. అనంతరం అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రకటించారు.దేశవ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఉద్యమాలను ప్రతినిధి సభకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షులు రాంభరోస్ బసోటియా, సుశీల విష్ణోయ్, పెరుమాళ్ మరియు విశాల్ చంద్రకర్ వేదికపై పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రాంలాల్ జీ, రాష్ట్ర ప్రచారక్ శ్రీధర్ జీ, అఖిల భారత సంస్థ మంత్రి దినేష్ కులకర్ణి, సహ సంస్థ మంత్రి గజేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు.
వ్యవసాయం–రైతు సమస్యలపై విస్తృత చర్చలు
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ అఖిల భారత ప్రతినిధి సభలో వ్యవసాయం మరియు రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా — సాధారణ బడ్జెట్, విత్తన బిల్లు, పంట భీమా, సేంద్రీయ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయ విధానాలు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు, కిసాన్ సమ్మాన్ నిధి పెంపు, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం, భూసేకరణ, దిగుమతి–ఎగుమతి విధానాలు, జీఎం విత్తనాలు మరియు ఇతర సంస్థాగత, నిర్మాణాత్మక అంశాలు చర్చకు రానున్నాయి.
జనరల్ సెక్రటరీ నివేదికలో సంఘం బలం ప్రతిఫలం,
అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా సమర్పించిన నివేదికలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు భారతీయ కిసాన్ సంఘ్ బలమైన విస్తరణ స్పష్టంగా ప్రతిబింబించింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన శిక్షణా శిబిరాలు, అధికారిక పర్యటనలు రైతు ఉద్యమాల ద్వారా సంఘం అట్టడుగు స్థాయిలో బలపడినట్లు నివేదికలో వివరించారు.

Leave A Reply

Your email address will not be published.