Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి రోజూ పండగే

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
  • రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజూ పండగ రోజేనని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన15 నెలల కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పాలనపై తెలంగాణ ప్రజలందరూ సంతృప్తితో ఉన్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు, రూ. 500 కే గ్యాస్ సౌకర్యం, రైతులకు రుణ మాఫీ, రైతు బంధుతో పాటు సన్నాలకు బోనస్ కల్పించిన ఘనత తమదేనని, ఇళ్లు లేని పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను విడతల వారీగా మంజూరు చేస్తూ వస్తున్నామని దీనిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస్ పేరుతో రూ. 50వేల నుంచి రూ.4 లక్షల రుణం ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోని సుమారు 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘శ్రీ విశ్వావసు నామ’ సంవత్సరంలోనూ ఇదే రకమైన పాలనను కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దరి చేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.