Take a fresh look at your lifestyle.

యుద్ధాలు.. దాడులు ఆపాలి..సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.

 

యుద్ధాలు,బాంబుల దాడుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలి.
ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలి.

 

ముద్ర, కరీంనగర్ :

ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశంపై మరొక దేశం యుద్ధాలు,దాడులు చేయకుండా జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని,తక్షణమే ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని అదే స్థాయిలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హితవు పలికారు.
సోమవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిందని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.

ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న బాంబుల దాడుల రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయని,దాని వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు,గ్యాస్ కొరత ఏర్పడుతుందని,వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టించి ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం పడుతుందని,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ల కొరత లేకుండా చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాంబుల దాడుల నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సంప్రదింపులు చరపాలని వెంకటరెడ్డి హితవు పలికారు.
పార్లమెంటు సమావేశాల్లో అత్యధిక రోజులు పాల్గొన్నానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోడీ దేశ ప్రజల ప్రయోజనాల గురించి ఏం చేశాడో చెప్పాలని,దేశంలో నిరుద్యోగం రూపుమాపలేదని,నల్లధనం వెలికి తీయలేదని,బీజేపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని,కార్పోరేట్ సంస్థలు బాగుపడ్డాయని,ఆదానీ,అంబానీల ఆస్తులు పెరిగాయని పేదల బ్రతులు మారలేదని ఆరోపించారు.దేశంలో ఐదు రాష్ట్రాలలో ఉన్న ఎన్నికలను దృష్టిలో బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ముడిసరుకుల మీద దృష్టి పెట్టలేదని లేదంటే ఇప్పటికే దేశ ప్రజలపై భారీగా భారం మోపేదనీ వెంకటరెడ్డి ఆరోపించారు.
సిపిఐ వందేళ్లు పూర్తి చేసుకుని భారత దేశ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సందర్భంగా ప్రజలకు మరింత చేరువ కావడం కోసం ఏప్రిల్ నెలలో ఇంటింటికి సిపిఐ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ నీ బలోపేతం చేయడం కోసం పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవాలని,ప్రజా సంఘాలను అన్ని గ్రామాల్లో,మండలాల్లో విస్తరించి మహాసభలు జరుపుకోవాలని శ్రీనివాస్ సూచించారు.
ఈ సమావేశములలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పొనగంటి కేదారి,అందె స్వామి,కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య న్యాలపట్ల రాజు తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.