Take a fresh look at your lifestyle.

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఫసాడ్ ఇల్యూమినేషన్

  • ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎంతో ఘన చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నిజాం రాజుల ఏలుబడిలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మాణం జరుపుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇకపై ఈ ఇల్యుమినేషన్ లైట్ల వెలుగులో కాచిగూడ రైల్వేస్టేషన్ బిల్డింగ్ ఎంతో చూడముచ్చటగా కనిపించనుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో మొట్టమొదటి డిజిటల్ పేమెంట్ సేవలు కాచిగూడ రైల్వేస్టేషన్ లోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎన్నో రకాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వే రంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో గత 11 ఏళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. గత 11 ఏళ్ళలో తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్ రెట్టింపు అవ్వగా, రైల్వేల నెట్‌వర్క్ మూడింతలు పెరిగిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు గత 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ. 30,832 కోట్ల బడ్జెట్ ను కేటాయించారన్నారు.ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారని,ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ అని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.