Take a fresh look at your lifestyle.

మహిళా సాధికారత చేతల్లో చూపిస్తాం

  • కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చుతాం.
  • సీత యాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళా సాధికారతను మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయాణం మొదలు పెట్టామని వివరించారు. ఈ మేరకు సోమవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ లో ‘షీ జాబ్స్’ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సీత(SITHA – షీ ఈజ్ ది హీరో ఆల్వేస్)’ యాప్ ను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ‘కుటుంబాల్లో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకుని నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఆ దిశగా ఇంటి నుంచే మొదటి అడుగు పడాలన్నారు. కేంద్ర గణాంకాల శాఖ ‘భారత్ లో పురుషులు, మహిళలు – 2024’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం, పట్టణాల్లో 89 శాతం మంది మహిళలు భాగస్వామ్యమవుతున్నారని తెలిపారు.ఇవి అంకెలు కావని, మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్న తెలంగాణ విజయగాథ ఇది అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది అని, విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. తాము ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న ప్రతి పథకాన్ని మహిళల పేర్లపైనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతోనే ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025కు శ్రీకారం చుట్టామన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎస్ హెచ్ జీల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మహిళల పేర్లపైనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వాటికి వారినే యజమానులుగా మార్చే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టామన్నారు. స్కూల్ యూనిఫాం కుట్టు పనులతో మహిళా సంఘాలకు ఏటా రూ.80 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ప్రారంభానికి చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలను వివరించారు. 16 నెలల్లో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామన్నారు. ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని చెప్పారు. దీంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయన్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. పదేళ్లలో గాడి తప్పిన విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చాలనే సంకల్పంతో రూ.11600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. ‘సీత’ యాప్ నైపుణ్య మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తున్న గ్రామీణ మహిళలకు ఇది గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి శ్రీలీలా, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఝాన్సీ రెడ్డి, షీ జాబ్స్ నిర్వాహకురాలు సీత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.