కుంభకోణాలన్నీ బయటపెడతా
సీఎంను బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి ప్రయత్నాలు
సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు
టెండర్లను పరిశీలించే సీఎంపీడీఐ, మెకాన్, ఆర్ఐపీడీఎస్ కు పక్కనబెట్టారు
మాజీ మంత్రి హరీశ్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ పాలనలో సింగరేణి టెండర్లలో జరిగిన కుంభకోణాలన్నీ ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేవలం నైని, సోలార్ స్కామ్‍లే కాదని ఇంకా చాలా కుంభకోణాలకు కాంగ్రెస్ నాయకుల తెరలేపారన్నాు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. ఆ విధానం లోపభూయిష్టం అన్న ఆయన.. ఇది వద్దని సింగరేణికి ఫిర్యాదులు వచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. ఈ విషయం మీటింగ్‍లో మాట్లాడారా లేదా బయటపెట్టాలని భట్టికి సవాల్ చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ బయటపెట్టాలన్నారు. సీఎం బావమరిది ఏ హోటల్ లో కూర్చుని టెండర్లు నిర్ణయించారో మాకు తెలుసని ఆఫోటోలు కూడా సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డే అవినీతి చేస్తున్నారంటే ఆయనతో మాట్లాడటమేంటని ప్రశ్నించారు. టెండర్ల విషయంలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భట్టి దాటవేశారన్నారు. ఈ విషయంలో మసిపూసి మారెడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదు
సింగరేణి టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని హరీశ్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధన బీఆర్ఎస్ హాయంలోనే వచ్చిందని భట్టి అబద్ధం చెప్పారన్నారు. సింగరేణి టెండర్లను సీఎంపీడీఐ, మెకాన్, ఆర్ఐపీడీఎస్ పరిశీలిస్తాయన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ వారికి టెండర్లు ఇచ్చుకునేందుకే ఈ సంస్థలను పక్కన పెట్టిందన్నారు. 2018 నుంచే సైట్ విజిట్ నిబంధన ఉందని భట్టి మాట్లాడారనీ కానీ ఓబీ (ఓవర్ బర్డెన్ రిమూవల్) వర్క్స్ కు గతంలో సైట్ విజిట్ విధానమే లేదనే విషయాన్ని గుర్తు చేశారు. నిజాన్ని ఒప్పుకోకుండా ఈ నిందను బీఆర్ఎస్ పైకి నెట్టే ప్రయత్నం భట్టి చేస్తున్నారన్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఓబీ వర్క్స్ లో సైట్ విజిట్ విధానం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ఈ విషయంలో ఎక్కడైనా మాట్లాడుదామో భట్టి చెప్పాలని సవాల్ చేశారు. 2025 జనవరిలో సైట్ విజిట్ లేకుండానే భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారన్నారు. అంటే మీ ప్రభుత్వం తొలినాళ్లలో పాత బీఆర్ఎస్ విధానాన్నే ఇక్కడ అమలు చేశారని చెప్పారు. . ఆ తర్వాత మూడు నెలలకు 2025 మే నెలలో వీఆర్ఓసీ టెండర్ ను సైట్ విజిట్ తో పిలిచారనీ దీని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి శోధా కన్ స్ట్రక్షన్ అని ఆరోపించారు.