- లబ్దిదారులే నిర్మాణకర్తలు.
- ఇప్పటి వరకు రూ. 99 కోట్లుచెల్లింపు.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి సోమవారం వరకు ఈ వారానికి సంబంధించి లబ్దిదారులకు 22.64 కోట్ల రూపాయిలను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి గతవారం రోజుల్లో ఇప్పటి వరకు 1549 ఇండ్లు బేస్‌మెంట్, 481ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో 117 ఇండ్లు శ్లాబ్ ల వరకు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్ఢిక విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవానికి ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టుపెట్టయినా సరే ప్రతి సోమవారం లబ్దిదారులకు నిధులను విడుదల చేసితీరుతామన్నారు. ఒక్క రోజుకూడా ఇందిరమ్మ లబ్దిదారుడు నిధుల కోసం ఎదురు చూడకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమచేస్తామన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు బేస్‌మెంట్ పూర్తి అయినవి 9, 877, గోడలు పూర్తి అయినవి1839, స్లాబు పూర్తయిన 388 ఇండ్లకు మొత్తం రూ .98.64 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదని లబ్దిదారులు తమ స్ధలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ జరుగుతోందని, లబ్దిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్దిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి సూచించారు.