-
ఎయిమ్స్ ను సందర్శించిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: దేశంలో ఆరోగ్యకరమైన జాతి నిర్మాణానికి యువ వైద్యులు అంకితం కావాల్సివుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హితవుపలికారు. భారత ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా భారత జాతి నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలమైనదని అన్నారు. కరుణ, నైతికతతో కూడా వైద్యసేవలు అందించడంలో యువ వైద్యులు ముందునిలవాలని ఆయన సూచించారు. బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సముదాయాన్ని ఆయన మాజీ గవర్నర్ దత్తాత్రేయ సోమవారం సందర్శించారు. ఎయిమ్స్ బీబీనగర్ అధ్యాపకులు, పరిపాలనా అధికారులతో పాటు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) అహంతెం శాంతా సింగ్ ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికారు.
తరువాత, ప్రొఫెసర్ (డాక్టర్) అహంతెం శాంతా సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొనసాగుతున్న నిర్మాణ కార్యకలాపాలు, అందించే వివిధ విద్యా కోర్సులు, రోగులకు అందిస్తున్న సేవలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆస్పత్రిలోని అన్ని బ్లాకులలో ఏర్పాటు చేసివున్న సౌకర్యాలను పరిశీలించారు. సమాజసేవ, జాతి నిర్మాణంలో యువ వైద్యులు తమంత తాము అంకితం కావాలని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఆయన ఎయిమ్స్ క్యాంపస్ లో సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తానూ ఒక మొక్కను నాటారు. భువనగిరి నియోజకవర్గ మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బుర్రా నరసయ్య గౌడ్ కూడా హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పరిపాలనా అధికారులు, అధ్యాపక సభ్యులతో ఆయన సంభాషించి, ఎయిమ్స్ బీబీనగర్‌ను మరింత బలోపేతం చేయడానికి విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) అహంతెం శాంతా సింగ్, డీన్ (విద్యాశాస్త్రం) డాక్టర్ నితిన్ అశోక్ జాన్, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ బిపిన్ పి. వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశాక జైన్, సూపరింటెండింగ్ ఇంజనీర్ డి.గోవర్ధన్, ఓఎస్డీ-కమ్-పీఆర్ఓ డాక్టర్ ప్రశాంత్ మాడ తదితరులు పాల్గొన్నారు.