- సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం.
- జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు.
- ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి.
- కుల వివక్ష నిర్మూలనతో నవ సమాజ నిర్మాణం సాధ్యం.
- జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: చదువు తోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య మ ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణలతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ గతంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని అన్నారు. 1827 లో మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా చాలా కష్టమని, అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని అన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సి స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.మహనీయుల జయంతి ఉత్సవాలలో వచ్చిన వక్తలు అడిగిన వివిధ అంశాలను అధికారులు సంపూర్ణంగా వివరించాలని, మహనీయుల ఆశయాల సాధన కోసం, సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చివరి అర్హుల వరకు అందే విధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.ఎమ్మెల్సి ఎల్ రమణ మాట్లాడుతూ ఒక రాత్రిలో అనూహ్యమైన మార్పులు రానప్పటికి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిదానంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, మెరుగైన విద్యాబోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జి. సునీత, కలెక్టరెట్ ఏ ఓ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరి అశోక్ కుమార్, మానల కిషన్, వివిధ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
