- హైడ్రా ప్రజావాణిలో 60 శాతానికి పైగా నాలాల కబ్జా ఫిర్యాదులే.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో నాలాల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నాడు హైడ్రా ప్రజావాణికి అందిన ఫిర్యాదుల్లో 60 శాతానికి పైగా నాలాల కబ్జాలపైనే ఉన్నాయి. నగరంలో ఉన్న ఏ నాలాను పరిగణలోకి తీసుకున్న సరే వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అయినట్లు పలువురు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. నాలాలను పూర్తిస్థాయిలో విస్తరించినట్లు అయితే, వరదలకు చాల వరకు అడ్డుకట్ట వేయవచ్చని వారు తెలిపారు. నాలాలు పొంగి ఇళ్ళలోకి, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరి విలువైన వస్తువుల నాశనం అవుతున్నాయని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంచెత్తిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి ఇళ్లను తీసుకురాడానికి రోజులు పడుతోందని వాపోయారు. రసూల్‌పురా వద్ద ప్యాట్నీ నాలా మాదిరిగానే చికోటి గార్డెన్స్‌తో పాటు ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద నాలా వెడల్పును పెంచాలని పలువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించారు. లంగర్ హౌస్ చెరువు 38 ఎకరాలు విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు ఆ చెరువు 24 ఎకరాలకు మిగిలింది. కొందరు చెరువును కబ్జా చేస్తున్నారు. ఇందుకు గాను చెరువు తూములను కూడా ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతో చెరువు ఫెన్సింగ్ ను విరగొట్టి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేసి చెరువు స్వభావాన్ని పూర్తిగా మార్చేశారు. రాకపోకలు సాగించడమే కాకుండా పార్కింగ్ యార్డుగా మార్చేశారు. ఆక్రమణలను తొలగించి చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చి, పూర్తిగా ఆధునికరించాలని ఫిర్యాదుదారులు కోరారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని దుర్గా ప్రావిన్స్ కాలనీ ప్రతి సంవత్సరం వరదలకు గురౌతోంది. మా ఇళ్ళు, రహదారులు నీటిలో మునిగిపోతాయి. సమీపంలోని అనేక కాలనీల నుండి వర్షపు నీటిని నేరుగా మా వైపు మళ్లించడం ద్వారా మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. పిల్లలు, వృద్ధులు రోజుల తరబడి ఇంటి లోపలే చిక్కుకుపోతున్నారు. గత సంవత్సరం రెండుసార్లు సంగారెడ్డి అదనపు కలెక్టర్ కూడా సందర్శించారు. సహజ నీటి మార్గాలు ఉన్న చోట కొత్త భవనాలు వచ్చాయి. ఒకసారి పరిశీలించి వరద నీటి కాలువలు చెరువులకు అనుసంధానమైనట్టు చూడగలరని దుర్గా ప్రావిన్స్ కాలనీ ప్రతినిధులు ఫిర్యాదుచేశారు. మియాపూర్ సర్వే నెం. 39లో మక్త మహబూబ్పేట్ చెరువు కబ్జాకు గురి అవుతోంది. అలాగే మైనింగ్ ల్యాండ్ సర్వే నెం. 44/5 లో వున్న 5ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు. మైనింగ్ ల్యాండ్‌ను బై నెం. ద్వారా నకిలీ పత్రాలు సృష్టించి 12 షెటర్లు వేశారు. 2013 లో తహసీల్దార్ నోటీనులు ఇచ్చి కూల్చడం జరిగింది. ఆ భూమి విలువ సుమారుగా 300వందల కోట్ల రూపాయలు. కబ్జా చేసినవారిపై చట్టపరమైన చర్చలు తీసుకొని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని (మైనంగ్ భూమిని) కాపాడ వలసినదిగా స్థానికులు కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఆనంద్‌బాగ్ కాలనీలోని స్ట్రీట్ నంబరు 10, 11 లలో రాకపోకలకు వీలు లేకుండా ఆ రెండు రహదారులను 2019 వ సంవత్సరం నుంచి మూసేశారు. 14 ఏళ్లుగా వినియోగించిన రహదారులను మూసేయడంతో తాము వేరే కాలనీల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాపోయారు.

- మాదాపూర్ వరద కాలువను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్.
మాదాపూర్‌లోని వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా లేదా.. ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు. దుర్గం చెరువుకు ఎండాకాలంలో కూడా నీటి కొరత వుండదు కనుక.. వర్షాకాలంలో నీటి నిలువల స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే నడుములోతు నీళ్లు తమ కాలనీలో నిలబడుతున్నాయని స్థానికులు కమిషనర్ కు విన్నవించారు. దుర్గం చెరువుకు ఇన్ ఫ్లో ఎంత మొత్తంలో ఉంది.. ఔట్ ఫ్లో ఎంతనే అంశాలను చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. చెరువులోపల తూములను, గేట్లను కూడా తిలకించారు. ఇందులో ఏ గేటు ఎత్తితే ఎంత నీరు వెళ్తుంది.. అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.
