ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిసెంబర్ త్రైమాసిక లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకుల నియంత్రణ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు విస్తృతంగా అందించాలని, ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో బ్యాంకులు ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారవేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, అలాగే DRDA, MEPMA, SC, ST, BC కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.
గ్రామీణ స్వయం ఉపాధి సంస్థల ద్వారా శిక్షణ పొందిన పేదల రుణ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా మంజూరు చేయాలని, గృహ నిర్మాణం, విద్యా రుణాలు వంటి ప్రాధాన్యత రంగాల్లో రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు.
చిన్న, మధ్య తరహా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాల విషయంలో బ్యాంకులు వేగంగా ముందుకు రావాలని, జిల్లా సహకార బ్యాంకులు విద్యా రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, సెర్ప్, SC, ST, BC కార్పొరేషన్ల పథకాల లక్ష్యాలను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో:
లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఆర్బిఐ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ప్రతినిధి మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆశీస్ రంజన్, ఎస్బిఐ రాకేష్, టీజీబీ మేనేజర్ దేవుల్ల, పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేసు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గోపాల్ నాయక్, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.