ఎల్బీ నగర్ ఎలివేటెడ్ కారిడార్‌ను కేంద్ర ప్రణాళికలో చేర్చాలి ఆ తర్వాతే డీపీఆర్ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎల్బీ నగర్ హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్డును ను కేంద్రప్రభుత్వం ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్ తయారు చే్స్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు సాఫీగా ప్రయాణం చేసేందుకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఎల్బీనగర్ హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం.. వార్షిక ప్రణాళికలో చేర్చాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ ఎల్బీనగర్ హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు.. భారీగా వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.ఈ ట్రాఫిక్‌ను తప్పించడంతోపాటు.. అబ్దుల్లాపూర్ మెట్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు కావాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో.. ఈ ఎల్బీ నగర్ హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై ఎమ్మెల్యే నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇక తాండూరు నియోజకవర్గంలో రోడ్లు చాలా దారుణ పరిస్థితిలో ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ దాటిన తర్వాత పనామా వద్ద ఫ్లై ఓవర్ మంజూరు చేసినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2, 3 గంటల్లో చేరుకునే విధంగా.. డబుల్ డెక్కర్ రోడ్డును మంజూరు చేయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.