Take a fresh look at your lifestyle.

మిస్సింగ్ టు మర్డర్ !

  • పోలీసుల దర్యాప్తుతో బహిర్గతమైన దారుణ నేరం.
  • అక్రమ సంబంధమే కారణం.
  • చిన్న కోడప్గల్ పంచాయతీ సెక్రటరీ హత్య.
  • భార్య, భర్త సహా నలుగురు అరెస్ట్.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : అక్రమ సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన చిన్న కొడఫ్గల్ పంచాయతీ కార్యదర్శి దారావత్ కృష్ణ తిరిగి రాలేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 7న చిన్న కొడఫ్గల్ మండల కేంద్రంలోని రెడ్డి చెరువులో కృష్ణ హత్యకు గురయ్యాడన్నారు. బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసుల విచారణలో చిన్న కొడఫ్గల్ గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్య, అతని భార్య సుజాత, వారి కులస్తులు ఏరా నోళ్ళ బాలరాజు, లింగంపేట మల్కయ్య అనే నలుగురు హత్యకు కారణమని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సంఘటన వివరాలు వివరించారు. 8 నెలల క్రితం సుజాత భర్త మల్కయ్య బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి 3 నెలల పాటు కూలి పని చేసి తిరిగి వచ్చి గ్రామంలో ఉంటున్నాడని తెలిపారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ఇరువురి మధ్య గొడవలు జరిగేవన్నారు. భార్యాభర్తల కాపురం చక్కదిద్దుకోవడం కోసం కృష్ణను హత్య చేయాలని ఇద్దరు కులస్తులు సహకారంతో పథకంలో భాగంగా ఈ నెల 5న సుజాత ఫోన్ నుంచి కృష్ణకు ఫోన్ చేసి రప్పించారని తెలిపారు. పథకంలో భాగంగా నలుగురు కలిసి కత్తి, గొడ్డలి, ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేసి రెడ్డి చెరువులో పారేశారని తెలిపారు. ఈ మేరకు నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నామని, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలి, ఇనుప రాడ్డు, 2 మోటార్ సైకిళ్ళు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసు త్వరగా ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్, ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.