ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐ.పి.ఎస్ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి పౌరుడు చట్టానికి లోబడి వ్యవహరించాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అక్రమంగా మద్యం విక్రయం పంపిణీకి అనుమతి లేదు అని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అధికారుల లిఖితపూర్వక అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, మైక్ సెట్లు లేదా శబ్ద కాలుష్యం కలిగించే పరికరాలు వినియోగించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. రూ.50,000/- కంటే ఎక్కువ నగదు తరలించాలంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని, సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, గతంలో గొడవలు చోటుచేసుకున్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నవారు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి, తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.