యూనిట్-3లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బంది
ప్రధాన యంత్రాలకు తప్పిన పెను ప్రమాదం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి:
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
పంప్ వద్ద ఆయిల్ లీకేజీ జరగడం వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ ఆవరణ అంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో కంట్రోల్ కేబుల్స్, కొన్ని వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని, పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది కారణంగా ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా నిలువరించగలిగామని తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలపై సాంకేతిక నిపుణులతో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.