నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారు
దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలనుకుంటున్నారు
6 గ్యారంటీలపై ద్రుష్టి మళ్లించేందుకు అనేక డ్రామాలాడుతున్నారు
కాళేశ్వరం డిజైన్ లోపం బాధ్యత కేసీఆర్ దే
కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు
అందుకే కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం లేదు
కవిత పార్టీని స్వాగతిస్తున్నాం…
ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తేనే ఏ పార్టీకైనా గుర్తింపు
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్…
ముద్ర , కరీంనగర్ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎం రేవంత్ రెడ్డి డిప్రెషన్‌కు లోనయ్యారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
శనివారం కరీంనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ పనితీరును అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, రాష్ట్ర రాజకీయాలపై పలు అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనతో అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు జరుగుతుందని, దక్షిణాదికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
6 గ్యారంటీల అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు వివిధ అంశాలను లేవనెత్తుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్, నిరుద్యోగ భృతి, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు భరోసా కార్డు, మహిళలకు బంగారం, స్కూటీ వంటి పథకాలు ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపాలపై స్పందిస్తూ, దీనికి ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ స్వయంగా డిజైన్‌లో జోక్యం చేసుకోవడం వల్లే లోపాలు తలెత్తాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం అవినీతి, డిజైన్ లోపాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని, అందువల్లే బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. సీబీఐకి పంపిన నివేదికలో కూడా పూర్తి వివరాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
ఇక కవిత కొత్త రాజకీయ పార్టీపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ స్థాపించవచ్చని, ప్రజల కోసం పనిచేసే పార్టీలకే ప్రజలు ఆదరణ ఇస్తారని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వం అభివృద్ధి, హామీల అమలుపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచించారు.