ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పధకాలు కొనసాగిస్తాం
రైతును రాజును చేస్తాం
రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు
పంట మార్పిడితో అధిక లాభాలు
10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొంటాం
తెలంగాణలో యూరియా కొరత రాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీలు సహకరించాలి
ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి
సిద్ధిపేటలో హరీశ్ రావును ఓడించిన వాళ్లకు మంత్రి పదవి ఇస్తాం
ముద్ర, సిద్ధిపేట :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పర్యటించిన సీఎం… అక్కడ నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇచ్చారు. అనంతరం అక్కడ రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వంటనూనె రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్సవాల పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. గడిచిన 28 నెలలో దాదాపు లక్ష 40 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసి రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.ఈ సందర్భంగా రైతుల ఖాతాలోకి ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. వచ్చే 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని తాను నమ్ముతాననని చెప్పారు. ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు, సంక్షేమానికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెటుతున్నా రైతులకు సంబంధించిన సంక్షేమానికి లోటురానివ్వడం లేదని చెప్పారు.

పంట మార్పిడి అవసరం ఉంది:
రాష్ట్రంలోని పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు ఆకుకూరలు బాగా పండించేవారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తో రంగారెడ్డి జిల్లాలో పంటల సాగు తగ్గిందన్నారు. దాంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులను లాభసాటిగా చేసేలా అవసరమైతే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, మోడీతో మాట్లాడుదామన్నారు. అయిల్ పామ్ పరిశ్రమ లాభసాటిదన్నారు. ప్రతిపంట సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లా ఒక్కో పంటకు ప్రసిద్ధి. రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయి. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల యూరియా కొరత ఏర్పడే సమస్య ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తయారవుతున్న యూరియా మొత్తం మనకే ఇవ్వాలి. యుద్ధం కారణంగా తెలంగాణలో యూరియా కొరత రాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలని దీన్ని మంత్రి తుమ్మల సమన్వయం చేయాలన్నారు.

మహిళలకు ప్రాధాన్యత
రాష్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించామన్నారు. మహిళల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహ్నిశలు నేను కష్టపడతాననీ మహిళలు ఎదిగితే తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకనమిగా ఎదుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలకు అర్థ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తాం:
విద్యాకమిషన్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి విద్యను అందించేలా రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా చేయిస్తామని అందువల్ల ప్రైవేట్ స్కూల్ మోజులో పడి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దన్నారు. 18 వేలకు పైగా ఉన్న స్కూళ్లను ప్రక్షాళన చేసే బాధ్యత నాదేననిచెప్పారు. సాంకేతిక నైపుణ్యం వైపు మనం మళ్లాలన్నారు.

2029లోనూ కాంగ్రెస్ దే అధికారం..!
2029లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు.
సిద్దిపేటలో గెలిచి ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడింది. కానీ ప్రజలు బీఆర్ఎస్‍కు అధికారం ఇచ్చారన్నారు. 2023లో మాకు అధికారం ఇచ్చారనీ. 2029 మళ్లీ మాకే అధికారం ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి:
సిద్దిపేటను1984 నుంచి 2029 ఒకే కుటుంబం పాలిస్తోందని ఒక్కసారి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని సీఎం అన్నారు. మార్పు చేసి చూస్తే మంచి జరుగుతుందో మీరే చూడాలన్నారు. మల్లన్నసాగర్, ఏటిగడ్డకిష్టాపూర్ వంటి సమస్యలు వచ్చిన నాడు మేము నిలబడ్డామని ఈ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు మేము వ్యవహరించడం లేదన్నారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు నిర్వాసితులను ఒప్పించాకే పనులు ప్రారంభించామన్నారు. మూసీలో మీ మొసలి కన్నీరు ప్రజలు అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, ప్రజల మేలు కోసం మాట్లాడాలి. కానీ ఏమి జరగవద్దు వీళ్లను ఏమీ చేయనివ్వొద్దు అంటే అది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్లేనన్నారు. ప్రతిపక్షం బాధ్యత ఇది కాదన్నారు. అభివృద్ధి జరగకుండా అడ్డం పడుకుంటామంటే ఊరుకుంటామా? ముఖ్యమంత్రినై సిద్ధిపేటకు రాలేదా? 2029లో మళ్లీ గెలిచి సిద్ధిపేటకు వస్తామన్నారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో భిన్నాభిప్రాయాలు:
ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే నా దృష్టి అని సీఎం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో రాజకీయంగా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ వారి నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ మా నిజాయితీ నిరూపించుకున్నామన్నారు.

నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు నేను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రారంభమయ్యాయి. కావాలనుకుంటే నేను ఈ ఫ్యాక్టరీని కొడంగల్ కు తీసుకువెళ్లకపోయేవాడినా? కానీ ఇక్కడి రైతుల కోసం ఇక్కడే నిర్మించాం. ఆ తర్వాతే తన నియోజకవర్గానికి ఒకటి ఇవ్వమని మంత్రులను కోరుతున్నానని చెప్పారు. నేను వివక్ష చూపడంలేదన్నారు. వివక్ష గురించి మాట్లాడితే 2014 నుంచి 2023 వరకు కొడంగల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు? మేమొచ్చాక ఈ ప్రాంతానికి నేను ఎన్ని నిధులు ఇచ్చామో లెక్కలు తీద్దామన్నారు. వివక్ష మా ఇంట వంట లేదన్నారు. బీఆర్ఎస్ నేతలను చూసి చూసి ప్రజలను వేయమన్నారు. పేదల కోసం పని చేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం మేము పని చేయామన్నారు. నాకు వ్యవసాయం తెలుసని చీడపురుగులకు ఏ మందు వేయాలో తనకు బాగా తెలుసన్నారు.