- 69 అడుగుల ఎత్తులో విగ్రహా ప్రతిష్ట.
- ప్రారంభమైన కర్రపూజ పనులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.మహాగణపతికి కుడి వైపున శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మి సమేత హాయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడవవైపు లలిత త్రిపుర సుందరి , శ్రీ గజ్జలమ్మ దేవి కొలువై ఉంటారు. ఈ మేరకు శుక్రవారం (నిర్జల ఏకాదశి) నాడు ఉత్సవ సమితి గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేసి, కర్ర పూజ చేశారు.ఈసారి మహాగణపతి విగ్రహాన్ని 69 అడుగుల్లో ప్రతిష్టిస్తున్నారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత చింతర రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. 70 ఏళ్ళుగా ఖైరతాబాద్‌లో బడా గణేష్ ఉత్సవాలను అందరూ కలిసిమెలసి నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఖైరతాబాద్ గణేష్ వేడుకలకు మంచి పేరు ప్రతిష్టతలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది జరిగే గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఎప్పటిలాగా మహా గణపతి ఉత్సవాలకు ప్రభుత్వం, పోలీస్, మీడియా సహకరించాలని కోరారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకోవాలని ప్రార్థించినట్లు చెప్పారు.
