తన నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు
కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసి ఆయన పక్కనే కూర్చున్నరు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్ పక్కన కూర్చోవడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇలాంటి నవ్వుల పాలయ్యే పనులు జీవన్ రెడ్డి స్థాయికి తగవని వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం దక్కిందన్నారు. జీవన్ రెడ్డి పార్టీ వీడినప్పటికీ ఆయనపై తమకు ఇంకా గౌరవం ఉందన్నారు.. కేవలం స్థానికంగా ఉన్న చిన్నపాటి సమస్యల కారణంగా దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడటం సరికాదని ఆయన హితవు పలికారు. తాను తీసుకున్న నిర్ణయంపై జీవన్ రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పార్టీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని సూచించారు.