Take a fresh look at your lifestyle.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి- హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ సూచన

అనుమానాస్పద ఏపీకే లింక్‌ను డౌన్ లోడ్ చేయొద్దు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి.. వారి పర్సనల్ సమాచారంతో పాటు.. బ్యాంక్ అకౌంట్ డేటాను తీసుకుని.. డబ్బులు దోచుకునే ఇలాంటి తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో నగరంలో జరుగుతున్న సైబర్ మోసాలను గుర్తించినట్లు సజ్జనార్ తెలిపారు. ఎవరైనా ఫోన్, మెసేజ్ చేసి.. వాటర్ బిల్లులు చెల్లించలేదని.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ.. నీటి కనెక్షన్ కట్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తారని పేర్కొన్నారు. అలాంటి మెసేజ్, కాల్స్‌కు భయపడవద్దని వెల్లడించారు. మొదట సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి నీటి బిల్లు బకాయి ఉందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. ఇలా జనాల్లో భయాన్ని తీసుకువచ్చి.. ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ‘HMWSSB WATER BILL UPDATE.apk’ అనే పేరుతో ఒక అనుమానాస్పద ఏపీకే లింక్‌ను పంపిస్తున్నారని.. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. ఆ యాప్ డౌన్‌లోడ్ చేస్తే.. మన సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుందని సజ్జనార్ వివరించారు. ఇలాంటి నకిలీ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మన ఫోన్‌ సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్తుందని సజ్జనార్ తెలిపారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు, ఓటీపీలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు. అదే సమయంలో బ్యాంకింగ్ యాప్‌లను కూడా గమనించాలని పేర్కొన్నారు. మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు ట్రాన్సాక్షన్లు చేస్తారని చెప్పారు. దీంతో క్షణాల్లోనే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పంపించే ఏ ఏపీకే ఫైల్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయకూడదని స్పష్టం చేశారు. నీటి బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. ప్రజలు కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే చెల్లించాలని హితవు పలికారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ పొరపాటున ఏపీకే ఫైల్ ఓపెన్ చేసినా.. దాంతో డబ్బులు పోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. లేకపోతే ఆన్‌లైన్‌లో cybercrime.gov.in పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.